అంతర్జాతీయ మార్కెట్లో కొండపల్లి.
- metiamaraavathi
- 1 hour ago
- 1 min read
150 మంది కళాకారులకు అవగాహన శిబిరం.

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28, (మేటి అమరావతి) శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్), ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో ఈ–కామర్స్ స్వీకరణ, కమ్యూనిటీ శక్తివృద్ధిపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. సుమారు 150 మంది కళాకారులు పాల్గొని ఆసక్తిగా చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో డిజిటల్ వేదికల ద్వారా కొండపల్లి బొమ్మలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎలా చేర్చాలన్న దానిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వామార్ట్ ప్రతినిధులు ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో నమోదు విధానం, ఉత్పత్తుల ఫోటోగ్రఫీ, నాణ్యత ప్రమాణాలు, సరైన ప్యాకేజింగ్, అంతర్జాతీయ రవాణా విధానాలు వంటి అంశాలను వివరించారు. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ల వినియోగంతో ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని, కళాకారుల ఆదాయం స్థిరపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టూరిజం అధికారి శిల్పా మాట్లాడుతూ సంప్రదాయ కళలను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుసంధానం చేయడం ద్వారా కొండపల్లి కళలకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమాలు కళాకారులకు దీర్ఘకాలిక లాభాలు అందిస్తాయని తెలిపారు. అనంతరం ఆర్‌టీఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్ లింకేజులు, సామర్థ్యాభివృద్ధి శిక్షణలు, ఫార్మల్ వ్యాపార సమీకరణ ద్వారా కళాకారులను గ్లోబల్ విలువ శృంఖలాల్లో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.ఈ వర్క్‌షాప్ కొండపల్లి బొమ్మలను ‘లోకల్ నుంచి గ్లోబల్’ దిశగా తీసుకెళ్లే కీలక ముందడుగుగా నిలిచింది.




Comments